గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్తగా మరో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్... ఈ కాల్ సెంటర్ను క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)పేరిట ప్రత్యేక వ్యవస్థ పని చేయనుంది.
అక్టోబరు నాటికి పూర్తి స్థాయిలో...
తొలుత గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే నాలుగు సేవలతో ఈ కాల్ సెంటర్ ప్రారంభించారు. ఆ తదుపరి అక్టోబరు నాటికి సచివాలయాల్లో అందించే 543 సేవలపై ఫిర్యాదులను స్వీకరించటం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను కూడా ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు, వాటి మార్గదర్శకాలను ప్రజలకు తెలియపరిచేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయాల ద్వారా ఆధార్ కార్డుల జారీ అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అధికారులు దీనికి కేంద్రం అంగీకరించదని సీఎంకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరగాలని.. దీనికి సంబంధించి షెడ్యూలు ప్రకటించాలని ఆధికారులను ఆదేశించారు.