వారానికి 25 లక్షల చొప్పున నాలుగు వారాల్లో కోటిమందికి కరోనా టీకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో రోజుకు రెండు గ్రామాల చొప్పున, వారంలో నాలుగు రోజులపాటు 8 గ్రామాల్లో టీకాలు వేయాలని చెప్పారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థ విధానాలను అమలుచేయొచ్చని సూచించారు. స్థానిక ఎన్నికలు పూర్తయినందున పట్టణాల్లో సోమవారం నుంచి ప్రారంభించి పెద్దఎత్తున టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా టీకాల ప్రణాళికపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో ఇంకా 3.97 లక్షల మందికి టీకా వేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 60 ఏళ్లు దాటిన, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 59.08 లక్షల మందికి టీకా ఇవ్వాలని, దీంతోపాటు ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా అందించాలని కేంద్రం నిర్ణయించిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
అందరికీ టీకా అందుతోందా.. లేదా పరిశీలించాలి
‘టీకాల ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని భాగస్వాములను చేయాలి. ప్రజల్లో చైతన్యానికి విస్తృత ప్రచారం నిర్వహించాలి. అందరికీ టీకా అందుతోందో లేదో అక్కడికక్కడే పరిశీలించాలి. అందనివారికి అవగాహన కల్పించి అప్పుడే టీకా అందించేలా చూడాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయితే టీకాలపై పూర్తిగా దృష్టిపెట్టే అవకాశం ఉండేది. కానీ అవి జరగకపోవడంతో ఈ కార్యక్రమానికి అడ్డంకులొస్తున్నాయి. దీనికి బాధ్యులెవరు? ఏదైనా మన పని మనం చేయాలి’ -సీఎం జగన్
నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్షలే..
‘కరోనా నిర్ధారణ పరీక్షలన్నీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే చేయాలి. కరోనా సోకినవారికి వైద్యసేవలు అందించడానికి గతంలో ఉన్న సదుపాయాలన్నీ కొనసాగించాలి. 104 నంబరుకు ఫోన్‌చేస్తే వైద్య సేవలు సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలి’ అని జగన్ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయనే దానిపై దృష్టిపెట్టామని, పాఠశాలల్లో కేసుల సంఖ్య చాలా తక్కువని అధికారులు పేర్కొన్నారు. ఏదైనా పాఠశాలలో కేసులు నమోదైతే మూడు రోజులపాటు పాఠశాలను మూసేసి.. అందరినీ పరీక్షించాకే తిరిగి నడిపేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.