కొవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు, జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా, కొవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలని సీఎం జగన్ సూచించారు. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. రెండో డోస్ వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
ఈ- క్రాపింగ్‌పై ధ్యాస పెట్టాలి..
వ్యవసాయ, సంబంధిత అంశాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. జూలై 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రైతు చైతన్య యాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఈ సీజన్లో 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అయితే ఇప్పటికి 4.98 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేయటంపై సీఎం ఆరా తీశారు. ఈ- క్రాపింగ్‌పైన పూర్తిగా ధ్యాస పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. పెట్టుబడి రాయితీ, బీమా, పంట కొనుగోళ్లు, రుణాలు, సున్నావడ్డీ పథకం అమలు ఇలా అన్ని అంశాలనూ ఈ-క్రాప్ ద్వారా పర్యవేక్షించే అవకాశముందని తెలిపారు. రైతు సాగు చేసిన భూమికి ఎలాంటి పత్రాలూ లేకపోయినా ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు
" పంటలకు సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం.. ఈ-క్రాపింగ్. ఈ-క్రాపింగ్‌పై కలెక్టర్లు, అధికారులు దృష్టి సారించాలి. రైతుకు శ్రీరామ రక్ష.. ఈ-క్రాపింగ్. రైతు ఎక్కడా మోసపోకూడదు.. అన్యాయం జరగకూడదు. ఏ పంటలు వేయాలి.. ఏవి వేయకూడదో రైతులకు తెలియాలి. విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. వ్యవసాయ సలహా కమిటీల సదస్సులు తరచుగా జరగాలి. ప్రతినెల తొలి శుక్రవారం ఆర్‌బీకే స్థాయి సదస్సు జరగాలి". సీఎం జగన్