సచివాలయంలో ‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 28న జగనన్న విద్యావసతి దీవెనను ప్రారంభిస్తామని, అదే రోజు మొదటి విడత మొత్తాన్ని, జులై-ఆగస్టు నెలల్లో రెండో విడత లబ్ధిని అందిస్తామని సీఎం ప్రకటించారు. '‘పింఛను, బియ్యం కార్డుల సామాజిక తనిఖీని ఫిబ్రవరి 2 నాటికి పూర్తి చేయాలి. 15 నుంచి 21 వరకు కొత్త పింఛను కార్డులు, బియ్యం కార్డులు అందించాలి. ఎన్నికలకు 6 నెలల ముందు పింఛన్లు 39 లక్షలుండగా ఫిబ్రవరి నుంచి 54.64 లక్షల మందికి అందిస్తాం' అని సీఎం జగన్ తెలిపారు.
ఫిబ్రవరి 15 నాటికి అర్హుల జాబితా..
ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాను ఫిబ్రవరి 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘2006 నుంచి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి. ఇళ్లస్థలాల ఖరారుకు లబ్ధిదారుల్లో మెజారిటీ ప్రజల అంగీకారం తీసుకోవాలి. 25 నాటికి ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తి కావాలి. మార్చి 1కి భూ సేకరణ, 10 నాటికి వాటిలో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. 15 నాటికి లాటరీలు తీసి ప్లాట్లు కేటాయించాలి. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉండేవారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్లాట్లను ఎక్కడ కేటాయిస్తున్నదీ ముందే చూపించాలి. మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే వారిని తరలించాలి. గతంలో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. వారికి మంచి జరగాలి’ అని పేర్కొన్నారు.
పంట వేసే సమయానికే మద్దతు ధర
రాష్ట్రంలో 3,300 రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 28న ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ‘ఏప్రిల్ మొదటివారంలో మరో 7 వేలు.. మొత్తంగా అదే నెల ఆఖరుకు గ్రామ సచివాలయాల దగ్గర 11,158 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. రైతు పంట వేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం’ అని చెప్పారు.
1 నుంచి మూడో విడత కంటి వెలుగు
‘వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడతను ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు కొనసాగిస్తాం. వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇప్పటివరకు 66,15,467 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించాం. 46వేల మందికి శస్త్రచికిత్సలు చేయించాం. లక్షన్నర మందికి కళ్లద్దాల పంపిణీ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం.వచ్చే నెలలో 4,906 కొత్త ఆరోగ్య ఉపకేంద్రాల ని ర్మాణ పనులు ప్రారంభిస్తాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.