రైతు భరోసా ఆలస్యంపై సీఎం ఆగ్రహం రైతు భరోసా పథకంలో 2 లక్షల 14వేల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకూ ఇంకా చెల్లింపులు ఎందుకు పూర్తి కాలేదని సీఎం జగన్ ప్రశ్నించారు. తక్షణం బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం.... పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పందన వినతుల పరిష్కారంలో అధికారులకు ఇస్తున్న శిక్షణ తరగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బార్లు, మద్యం దుకాణాల విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు అమలయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ గోదాముల నుంచి మద్యం.. దుకాణాలకు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చే ప్రతిపాదనను పరిశీలించాలన్నారు. డిసెంబరు 21వ తేదీ నుంచి 2 వందల కోట్ల రూపాయలతో చేపట్టనున్న నేతన్న నేస్తం పథకానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
నవశకంపై సీఎం ఆరా
మరోవైపు వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం వైఎస్ఆర్ నవశకంపై సీఎం ఆరా తీశారు. అన్ని సంక్షేమ పథకాల అర్హుల వివరాలను డిసెంబరు 15వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు ధ్రువపత్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో జారీ చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. వైఎస్ఆర్ వాహన మిత్రలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకొనే వారికి విశ్రాంతి సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని డిశ్చార్జి అయిన 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు. ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి.. మార్చి 1 కటాఫ్ తేదీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జనవరి 1 నుంచి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఆయా ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు. ఇసుక రాష్ట్ర సరిహద్దుల బయటకు వెళ్లకూడదని, అలాగే మద్యం లోపలికి రాకూడదని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : రైతులకు ఆర్థిక సాయం ఎందుకు అందలేదు... సీఎం ఆగ్రహం