రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అపరిష్కృతంగా ఉన్న 21,750 కేసులను పరిష్కరించి డబ్బు అందించాలన్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అమ్మఒడి కింద 42.33 లక్షల మందికి డబ్బు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పింఛన్ల జాబితాలో పేర్లు లేని వారికి పునఃపరిశీలన చేసి అర్హులని తేలితే 2 నెలల పింఛను ఒకేసారి అందిస్తామని చెప్పారు. కలెక్టర్లు ఈ నెల 17 నాటికి పింఛన్ల రీవెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
15 నుంచి బియ్యం కార్డులు
బియ్యం కార్డుల విషయంలోనూ రీవెరిఫికేషన్ పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఈ నెల 15 నుంచి బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ నెల 15 నుంచి కర్నూలు, కడప, విశాఖ, శ్రీకాకుళంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మార్చి 7 నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో కార్డుల పంపిణీ చేయనున్నారు. మార్చి 25 నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరంలో కార్డులు ఇవ్వనున్నారు. మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్ కార్డులు ఇవ్వాల్సి రావడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇదీ చదవండి:
మహిళా అధికారికి 'దిశ' అండ.. సిబ్బందికి సీఎం అభినందన