రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమంలో ఎక్కువ ఫిర్యాదులకు పరిష్కారం దొరుకుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల వినతుల పరిష్కారంలో గ్రామ సచివాలయాలు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. డిసెంబరు 15 నుంచి సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందన కింద ఇప్పటి వరకూ 6 లక్షల 99 వేల 548 ఫిర్యాదులు వస్తే... అందులో అధికంగా ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్ సమస్యలే ఉన్నాయని చెప్పారు. పరిష్కారమైన వినతులు 80 శాతం మేర ఉన్నాయని వివరించారు. ఎక్కడా అవినీతి కనిపించకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా
గ్రామ సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనివల్ల సోషల్ ఆడిట్ జరుగుతుందని... అర్హులు, అనర్హుల విషయం అక్కడికక్కడే తేలిపోతుందని వివరించారు. ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అమ్మేలా ఓ స్టాల్ను ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 1 నుంచి వైఎస్ఆర్ లా నేస్తం పథకం కూడా ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు.
నవంబర్ 1నుంచి మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ
వైఎస్ఆర్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం నవంబరు 2 నుంచి మొదలవుతుందని... ఇప్పటికే లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు పూర్తయ్యాయని సీఎం జగన్ వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఆరోగ్యశ్రీ అమలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని... కొరత ఉందని గుర్తిస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని సీఎం ఆదేశించారు. నవంబరు 7న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేస్తామని తెలిపారు. రూ.10వేల లోపు సొమ్ము కోల్పోయిన 3 లక్షల 69 వేల మందికి రూ.264 కోట్లను చెల్లిస్తున్నామని సీఎం వివరించారు.
మత్స్యకారులకు ఆర్థికసాయం