రాష్ట్ర స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉద్యోగం ఉపాధి దిశగానే చదువులు, శిక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి అంశంపై సమీక్షించిన ముఖ్యమంత్రి... ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఓ నైపుణ్యాభివృద్ధి కళాశాల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మొత్తం రాష్ట్రంలోని స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ పరిధిలో 25 కళాశాలలు ఉండాలని సూచించారు. విద్యార్ధులు, యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్యప్రణాళికలోనూ మార్పులు చేయాలన్నారు.
డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏడాది అప్రెంటీస్
ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటీస్లుగా చేర్చేలా ప్రణాళిక చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కార్యాచరణ నెల రొజుల్లోగాపూర్తి చేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వశాఖల్లో స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థికశాఖకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ రూపురేఖలు మారాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవవనరుల మ్యాపింగ్ జరగాలని అధికారులకు సూచించారు. స్థానికంగా వారి సేవలు పొందేలా ఒక యాప్ రూపొందించాలని... దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవవనరులు అందుబాటులోకి వస్తాయన్నారు.