ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Review: పాఠశాలల నిర్వహణలో.. ఇకపై సచివాలయ ఉద్యోగుల భాగస్వామ్యం - school education news

CM Jagan Review on Education: స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని రాష్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శించనుడగా... నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించనున్నారు. మండలస్థాయిలో ఉండే ఎంఈఓలో ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. నాడు – నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. తరగతి గదులను డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.

jagan review
jagan review

By

Published : Sep 12, 2022, 8:14 PM IST

Updated : Sep 13, 2022, 6:39 AM IST

CM Jagan Review on School Education: పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు కింద పనులు పూర్తిచేసిన పాఠశాలల ఆడిట్‌ నివేదికను సీఎంకు అధికారులు అందించారు. స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిటింగ్ నిర్వహించారు. ప్రతి నెల ఒకసారి ఆడిట్‌ చేయాలన్న సీఎం.. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా.. లేదా అనేది పరిశీలన చేయాలన్నారు. అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలని నిర్దేశించారు. స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వాడుకుని.. స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్‌ను స్కూళ్లలో ప్రదర్శించాలన్నారు. ఈ నంబర్‌కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించగా.. 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు.

మార్చినాటికి తొలిదశ డిజిటలైజేషన్‌

టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై సీఎం సమీక్షించారు. 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని.. ఈ ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ వేయించి ఇవ్వాలని నిర్ణయించారు. తరగతి గదులను డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంపైనా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. పలు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా వీటిని తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతి గదుల డిజిటలైజేషన్‌ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

విద్యాకానుకపైనా సమీక్షించిన సీఎం.. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కచ్చితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వీటిపై ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలని, వాటిని అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల పారిశుద్ధ్య లోపం, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎం అన్నారు.

మండలానికి ఇద్దరు విద్యాధికారులు..

పాఠశాలల పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు విద్యాధికారుల చొప్పున నియమించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మండల విద్యాధికారుల్లో ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి పాఠశాలల నిర్వహణ అంశాలు అప్పగించాలని సూచించారు. ‘నాడు-నేడు పనులు పూర్తయిన బడుల్లో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది నెలకోసారి పరిశీలించాలి. అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేయించాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేసేందుకు వీలుగా ఫోన్‌ నంబరును బడుల్లో ప్రదర్శించాలి. వచ్చే ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుకను పిల్లలకు కచ్చితంగా అందించాలి. ఏకరూప దుస్తుల కుట్టు ఛార్జీలను ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలి. బడుల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలు, సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలి. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలి. వీటిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలి. ప్రతివారం పాఠశాలను సంక్షేమ, విద్య సహాయకులు, మహిళా పోలీసు, నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించాలి’ అని ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2022, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details