ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Southern Zonal Council: తెరపైకి మరోసారి ప్రత్యేక హోదా!

తిరుపతిలో జరగనున్న సదరన్‌ కౌన్సిల్‌ (Southern Zonal Council) సమావేశంలో.. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంకావాలని నిర్దేశించారు.

Southern Zonal Council
Southern Zonal Council

By

Published : Nov 3, 2021, 4:17 PM IST

Updated : Nov 4, 2021, 4:36 AM IST

ఈ నెల 14న తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ (Southern Zonal Council) సమావేశం జరగనున్న సందర్భంగా.. ముఖ్యమంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చకు పెట్టాలని తీర్మానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలన్నీ చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఏపీతో ముడిపడినవి ఏమైనా ఉంటే వాటిపై తగిన రీతిలో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఎం ప్రస్తావించిన ఇతర అంశాలు.

  • ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను ఎజెండాలో పొందుపరచాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలను లేవనెత్తాలి.
  • తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్తు బకాయిలు, రెవెన్యూ లోటు, హేతుబద్ధతలేని లేని రీతిలో రేషన్‌ బియ్యం కేటాయింపులు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు తదితర అంశాలను ప్రస్తావించాలి.
  • నదుల అనుసంధానంపై కేంద్రం రూపొందిస్తున్న ప్రతిపాదనల విషయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా, రాష్ట్రం సూచించే ప్రత్యామ్నాయ వివరాలను పొందుపరచాలి.

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, సహా పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అండమాన్‌నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ హాజరవుతారు.

సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల సమావేశంలో చర్చ జరిగి, మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు తెలిపారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూ లోటుపై సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

రేషన్‌ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు చేస్తోందని సీఎం జగన్​ అన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్నీ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని సీఎం నిర్ణయించారు.

నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల మీదా సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలని సీఎం సూచించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు..

ఇదీ చదవండి:

diwali wishes: దీపావళి పండుగ.. అందరి జీవితాల్లో కాంతులు నింపాలి: సీఎం జగన్

Last Updated : Nov 4, 2021, 4:36 AM IST

ABOUT THE AUTHOR

...view details