గోదాముల వద్దే జనతా బజార్ల ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తం 13 రకాల సదుపాయాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షించారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి సమీక్షకు హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రూ.6 వేల కోట్లతో సౌకర్యాల కల్పనపై చర్చించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి చర్యలపైనా చర్చ జరిగింది. పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు.
పీఏసీఎస్‌ల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఏర్పాటైన కమిటీ నివేదిక పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్‌బీకేల బలోపేతానికి తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం... నాణ్యమైన పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఉండాలని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపునకు ఈ–మార్కెట్ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.