మన బడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు నాడు నేడు తొలి దశ పనులు పూర్తి చేయాలని...ప్రతి పాఠశాలను ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దాలన్నారు. రెండోదశ కార్యక్రమాలనూ సకాలంలో ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలకు మహర్దశ పట్టించామని.. రెండో దశలో భాగంగా మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
అధికారుల ప్రజెంటేషన్
నాడు-నేడు తొలిదశ ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా జిల్లా కంకిపాడు పంచాయతీలోని కొలవెన్ను గ్రామంలో పురాతన పాఠశాల రూపురేఖలను మార్చిన వైనాన్ని సీఎం ఎదుట వీడియో ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం మండల పరిషత్ పాఠశాల, విశాఖ జిల్లా గిడిజాల జడ్పీహెచ్‌ఎస్ పొటోలను కూడా ప్రదర్శించారు. వీటితోపాటు మరికొన్ని పాఠశాలలలో నాడు-నేడు కింద చేసిన మార్పులను కూడా అధికారులు ప్రదర్శించారు. అన్ని పాఠశాలల్లో పిల్లలకు పరిశుభ్రమైన తాగు నీరు అందించేలా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ బాధ్యతను కంపెనీలకు అప్పగించాలని సీఎం నిర్దేశించారు.
పదో అంశంగా కిచెన్
నాడు-నేడులో ఇప్పటి వరకు 9 రకాల మార్పులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశం కిచెన్ చేర్చారు. సెంట్రలైజ్డ్ కిచెన్‌కు సంబంధించిన ప్లాన్లను అధికారులు సమావేశంలో వివరించారు. వీలైనంత త్వరగా వాటిని ఖరారు చేసి, పూర్తి పరిశుభ్రంగా ఉండేలా కిచెన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, అప్పటిలోగా పనులన్నీ పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. పాఠశాలలను తెరిచే రోజున విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్‌ను పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్ క్లాత్.. అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. ఈ విషయంలో అధికారుల పనితీరును జగన్ ప్రశంసించారు.
మూడోదశలో 16వేల పాఠశాలలు
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో మిగిలిన 31వేల 73 పాఠశాలలు, విద్యా సంస్థలలో దాదాపు 7వేల 700 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రెండో దశలో 14,584 స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4732 కోట్లు వ్యయం కానుందని, ఈ నెలాఖరులోగా ఆయా స్కూళ్లు, విద్యా సంస్థలను గుర్తించాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 14న పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మూడో దశలో 16 వేల 489 స్కూళ్లు, విద్యా సంస్థల్లో రూ.2969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి వాటన్నింటిని గుర్తించి, నవంబరు 14, 2021 నుంచి పనులు ప్రారంభించి మార్చి 31, 2022 నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పనులు పూర్తైన వెంటనే పాఠశాలల్లో అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని, విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి పాఠశాల ఉండాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి:ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అన్నిపోలీసు స్టేషన్లలో ఫిర్యాదు