ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.1,500 కోట్లు: సీఎం జగన్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీనికోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెల తనిఖీ విధానం ఉండాలని స్పష్టం చేశారు.

cm jagan
cm jagan

By

Published : Feb 7, 2020, 5:57 PM IST

ముఖ్యమంత్రితో సమావేశ వివరాలు వెల్లడిస్తోన్న మంత్రి ఆదిమూలపు సురేష్​

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్​ రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నాడు- నేడుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పాఠశాలలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన‌్న 50 డిగ్రీ కళాశాలల్లో సదుపాయాల కల్పనకు 1,500 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమీక్షలో సీఎం జగన్ తెలిపారు. పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెల తనిఖీ విధానం ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పాఠశాల విద్యాశాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పారిశుద్ధ్య మెరుగు కోసం చర్యలు

పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం విద్యార్ధుల తల్లిదండ్రులు ఇస్తున్న వెయ్యి అంతకంటే ఎక్కువ మొత్తాలకు సంబంధించిన వివరాలను పాఠశాలల్లో డిస్​ప్లే బోర్డులో పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ఈ తరహా సూచనలు చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు.

నాణ్యత తగ్గకూడదు

నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత తగ్గేందుకు వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. దశల వారీగా చేపట్టాల్సిన పనుల కార్యాచరణపైనా జగన్​ ఆరా తీశారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి అవుతుందని సీఎం ప్రశ్నించగా... నాడు - నేడు మొదటి దశలో భాగంగా 15,715 పాఠశాలల్లో అబివృద్ధి పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన, మాధ్యమం మార్పు తదితర అంశాల తర్వాత ప్రైవేటు స్కూళ్ల నుంచి విద్యార్ధుల వలస ప్రారంభమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ప్రైవేటు ఫీజులపై దృష్టి

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులపై దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘనపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కనెక్ట్‌ ఆంధ్ర నుంచి నిధులు సమన్వయం చేసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమీక్ష తర్వాత మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

ఇదీ చదవండి:

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details