ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనవరి నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలి: సీఎం జగన్

సమగ్ర భూ సర్వేపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1, 2021 నుంచి సర్వే చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 2023 ఆగస్టు నాటికి సర్వే పూర్తి చేయాలని సూచించారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ సమగ్ర భూ సర్వే జరగాలని..ఆ మేరకు సర్వే బృందాలు పెంచాలన్నారు.

cm jagan review on land survey
cm jagan review on land survey

By

Published : Aug 31, 2020, 2:57 PM IST

Updated : Aug 31, 2020, 7:43 PM IST

భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేసి అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమగ్ర భూ సర్వే కోసం మౌలిక వసతులు కల్పించాలని, సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనూ సబ్ రిజిస్ట్రార్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి , రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ప్రసాద్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ ఐజీ సిద్ధార్థజైన్‌తో పాటు, పలువురు అధికారులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను సమావేశంలో అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదే అని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు.

వచ్చే ఏడాది, జనవరి 1న ప్రారంభించే సమగ్ర భూ సర్వేను దాదాపు రెండున్నర సంవత్సరాల్లో 2023, ఆగస్టు నాటికి పూర్తి చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అన్ని మండలాల్లో ఒకేసారి సమగ్ర భూసర్వే ప్రారంభించాలన్నారు. అలాగే అర్బన్‌ ప్రాంతాల్లో కూడా సర్వే చేయాలని ఆదేశించారు. దీని కోసం ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న 4500 బృందాలను పెంచుకోవాలన్నారు. సర్వే చేస్తున్న సమయంలో వచ్చే వివాదాలను వెంటనే పరిష్కరించేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. సమగ్ర భూ సర్వేపై గ్రామ సచివాలయాల్లో విస్తృత ప్రచారం చేయాలన్న సీఎం... అందుకోసం గ్రామ సచివాలయాల్లో పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

  • గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ సేవలు

గ్రామ సచివాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ సేవలు అందాలని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు. దీని వల్ల రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతాయని, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు అవుతాయని వెల్లడించారు. అంతేకాకుండా ఏమైనా సమస్యలు ఉంటే.. వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. భూ సర్వే కోసం కొనుగోలు చేసిన పరికరాలు గ్రామ సచివాలయానికి అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. ఇప్పుడు కొన్న పరికరాలన్నీ గ్రామ సచివాలయాల్లో ఉంచాలని నిర్దేశించారు. భవిష్యత్తులో ఎలాంటి భూ లావాదేవీలు జరిగినా వాటిని వినియోగించుకునే వీలు ఉంటుందని పేర్కొన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

  • రాళ్లు ప్రత్యేక డిజైన్​లో ఉండాలి

సమగ్ర భూ సర్వే కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. భూ సర్వే కోసం కావాల్సిన రాళ్లు ప్రత్యేక డిజైన్‌లో ఉండాలని సీఎం సూచించారు. సర్వే ప్రారంభం అయ్యే నాటికే అవసరమైన పరికరాలు, డ్రోన్లు, రోవర్లు, బేస్‌ స్టేషన్లు, మొబైల్‌ ట్రైబ్యునల్స్, సర్వే బృందాలకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా వాటి వినియోగంపై సర్వేయర్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. మొత్తం 3 అంశాల్లో నైపుణ్యాలను పెంచుకునేలా ఆ శిక్షణ ఇస్తున్నట్టుగా అధికారులు వివరించారు. 1930 తర్వాత జరుగుతున్న సమగ్ర భూ సర్వేపై గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించిన సీఎం.. సమగ్ర భూ సర్వే లక్ష్యాలపై వారికి సమగ్ర సమాచారం అందించడంతో పాటు, దాని వల్ల భూ యజమానులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు.

  • మార్పులు, చేర్పులు చేయలేరు

సమగ్ర భూ సర్వే చేపట్టే ప్రక్రియ విధానం సహా ప్రయోజనాలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. భూ సర్వే చేయగానే రోవర్‌ నుంచి నేరుగా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో కంప్యూటర్లో పూర్తి వివరాలు నమోదవుతాయని, మధ్యలో ఏ వ్యక్తి కూడా వాటిని మార్పులు, చేర్పులు చేయలేరని వెల్లడించారు. రికార్డుల స్వచ్ఛీకరణ.. రైతులకు మరింత మేలు చేస్తుందన్న అధికారులు, దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలు పారదర్శకత వల్ల తీరిపోతాయని, రైతుకు పూర్తి హక్కులు దాఖలు పడతాయని వెల్లడించారు. సర్వే సందర్భంగా తలెత్తే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఉంటాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. వివాదాలకు తావు లేకుండా భూ సమస్యలను పరిష్కరించడానికి ఆ ట్రైబ్యునల్స్‌ సహాయ పడతాయని తెలిపారు.

ఇదీ చదవండి:ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

Last Updated : Aug 31, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details