ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నవంబరు నుంచి పోలవరానికి గేట్లు... సీఎం నిర్దేశం

రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్​.. అధికారులతో సమీక్షించారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

cm jagan  review on irrigation projects
సీఎం జగన్

By

Published : Jun 26, 2020, 7:05 AM IST

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు నుంచి అమర్చాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వర్షాకాలంలోనూ అంతరాయం లేకుండా ప్రాజెక్టు పనుల్ని ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్‌-2, వెలిగొండ ప్రాజెక్టులో హెడ్‌ రెగ్యులేటర్‌, టన్నెల్‌-1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2లోని రెండో దశ పనులపై జగన్‌ సమీక్షించారు.

వరదనీరు వచ్చేటప్పుడూ పోలవరం ప్రాజెక్టులో చేసుకోదగ్గ పనుల్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. స్పిల్‌వే పూర్తయిన తర్వాత నవంబరు నుంచి గేట్లు బిగించాలి. కాబట్టి ఆలోగా ఫ్యాబ్రికేషన్‌ పనులు పూర్తి చేయాలని, ప్లాన్‌-బి కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పనులు ప్రణాళికాబద్ధంగా సాగకపోతే షెడ్యూల్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. గత ఏడాది వరదల్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం ముంపు బాధితుల్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 41.5 మీటర్ల ఎత్తు వరకు ముంపు ప్రమాదం ఉన్నవారికి మొదట సహాయ, పునరావాస కార్యక్రమాల్ని ముమ్మరం చేయాలన్నారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.3,791 కోట్లను కేంద్రం నుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వెళ్లిన వారిని వెనక్కు పిలుస్తున్నాం

‘ఆగస్టు తప్ప మిగతా నెలల్లో స్పిల్‌వే పనులు కొనసాగేలా ప్రణాళిక వేసుకున్నాం. రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పూర్తి చేసుకుని నవంబరు నుంచి అమర్చుతాం. ఏప్రిల్‌లో 3 వేల మంది కూలీలు పనిచేయగా, కొవిడ్‌ వల్ల 900 మందే మిగిలారు. వెళ్లిపోయిన వారందర్నీ వెనక్కు పిలుస్తున్నాం. ప్రస్తుతం 2 వేల మంది పనిచేస్తున్నారు’ అని అధికారులు వివరించారు. స్పిల్‌వేలోని 52 స్తంభాలు గతంలో సగటున 28 మీటర్ల ఎత్తు ఉంటే, ప్రస్తుతం 47.44 మీటర్ల ఎత్తుకు చేరాయని తెలిపారు.

అధికారులు సీఎంకు చెప్పిన వివరాలు

* అవుకు టన్నెల్‌-2ను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేస్తాం.

* వెలిగొండ టన్నెల్‌-1లో ఇంకా 700 మీటర్లు తవ్వాలి. వచ్చే అక్టోబరుకు టన్నెల్‌-1 ద్వారా నీరు విడుదల చేస్తాం.

* నల్లమలసాగర్‌ పూర్తయింది. సహాయ, పునరావాసానికి అన్ని అనుమతులూ వచ్చాయి. నల్లమల సాగర్‌ నుంచి తూర్పు ప్రధాన కాలువకు వెళ్లే 180 మీటర్ల సొరంగం పనులూ మరో మూడు నెలల్లో పూర్తవుతాయి.

* తీగలేరు కాలువకు వెళ్లే 600 మీటర్ల సొరంగం పనులు పూర్తవుతున్నాయి. నాలుగు నెలల్లో సొరంగం, కాలువ పనులు పూర్తి చేస్తాం.

* నెల్లూరు బ్యారేజీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రెండు నెలల్లో సివిల్‌ పనులు పూర్తి చేస్తాం. అక్టోబరు చివరి నాటికి మొత్తం పనులు పూర్తవుతాయి.

* సంగం బ్యారేజీ పనులూ అక్టోబరు చివరికి పూర్తవుతాయి.

* వంశధార-నాగావళి అనుసంధానాన్ని డిసెంబరుకు పూర్తి చేస్తాం.

* వంశధార ఫేజ్‌-2లో రెండో దశలో మిగిలిపోయిన పనుల్ని కూడా వేగంగా, సురక్షిత స్థాయి వరకు పూర్తి చేసి, 8 టీఎంసీల నీరు నింపుతాం. వచ్చే ఏడాది జులైకు మిగతా పనులూ పూర్తవుతాయి.

గండికోటలో నీటి నిల్వకు చర్యలు తీసుకోండి: సీఎం

నేరడి బ్యారేజీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:స్థానిక వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details