సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో లోపాలు లేకుండా చూడాలన్న సీఎం... ఏ పని చూసినా కుంభకోణమే కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. జలాశయాలు, నూతన నిర్మాణాలపై ఉన్నతాధికారులతో జిల్లాల వారీగా సమీక్షించారు. జరిగిన పనులు, పెండింగ్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టులన్ని నింపాలి...
ఈ ఏడాది కృష్ణా వరద జలాలు బాగా వచ్చాయని సీఎం జగన్ అధికారులతో అన్నారు. వరదలు వచ్చినా రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి సమయం పడుతోందని... ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వరద జలాలు 30 – 40 రోజులకు మించి ఉండవనే అంచనాతో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. తక్కువ సమయంలోనే ప్రాజెక్టులు నింపాలన్నారు. 30 రోజుల్లో ప్రాజెక్టులు నింపే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
సహాయ పునరావాసం కోసం ప్రత్యేక అధికారి...
వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆరా తీసిన సీఎం జగన్... టన్నెల్ –1, 2 సహా... హెడ్ రెగ్యులేటర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పల్నాడు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస పనులపై సమీక్ష చేసిన జగన్... సహాయ పునరావాసం కోసం ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు. ఇటీవల వరద బాధితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలకు సన్నాహాలు...
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు విషయంలో... ఒడిశాతో అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై నోట్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రితో చర్చలకు సన్నాహాలు చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టులపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళిక వేయాలని... జిల్లాల మధ్య నీళ్ల కోసం వివాదాలు ఉండకూడదని స్పష్టం చేశారు. మూడు, నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టులన్నీ పూర్తికావాలని అధికారులకు గడువును విధించారు.
ఇదీ చదవండి
ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు