స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బొత్స సత్యన్నారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా అధికారులు హాజరయ్యారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులతో సీఎం చర్చించారు. పారిశ్రామిక విధానానికి సంబంధించి మార్గనిర్దేశం చేశారు.
వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడటం ద్వారా కార్యకలాపాలకు ఊతం ఇవ్వడం ప్రభుత్వం చేదోడుగా నిలవాలన్న సీఎం సూచించారు. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా...,అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలని జగన్ పేర్కొన్నారు. పరిశ్రమకోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు, ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు.
1. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాలుష్య నివారణా పద్దతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. కనీసంగా ఇందులో నలుగురు సభ్యులు ఉండాలి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డును టై అప్ చేయాలి.
2. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే... ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా అప్పటికే టైఅప్ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది.
3. ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీని వివరిస్తారు, అవగాహన కల్పిస్తారు. పెట్టుబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్‌ఐసీసీ పరిశీలించి ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్‌ఐపీబీ ముందుకు వస్తుంది.
4. ఎస్‌ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజంటేషన్ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది.
5. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్ విండో విధానం నిలుస్తుంది.