సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలని సీఎం సూచించారు. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో కనీసం 23 టీఎంసీలు నిల్వ చేయాలని సీఎం అన్నారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు అమలు చేయాలన్నారు. ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దన్నారు. రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
రైతులను ఇబ్బంది పెట్టే చర్యలొద్దు: సీఎం జగన్ - పోలవరంపై సీఎం జగన్ సమీక్ష
రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి... భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలుపై ఆదేశాలు ఇచ్చారు. వరద జలాలను ఒడిసి పట్టి ప్రాజెక్టుల్లో నీరు నింపాలని సీఎం సూచించారు. పోలవరం పనుల్లో జాప్యం వద్దన్న సీఎం... అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాల్వల పనులు 71 శాతం పూర్తయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్లు బిగిస్తామన్నారు. కొవిడ్ సోకి కొంతమంది సిబ్బంది పనుల్లోకి రాకపోవడం వల్ల కాస్త జాప్యం జరిగిందని అధికారులు అన్నారు. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ సిబ్బంది నియామకానికి అనుమతిచ్చారు.
ఇదీ చదవండి :రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు...వంద ఎకరాల్లో పంట నష్టం