గృహనిర్మాణాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన జాయింట్ కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పెద్దఎత్తున గృహనిర్మాణాలు చేపట్టేందుకు కారణాలు, సహా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామన్న ముఖ్యమంత్రి... 17వేల లేఅవుట్లలో ఈ ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొన్ని లేఅవుట్లు మున్సిపాల్టీల సైజులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లను గతంలో దేశంలో ఎప్పుడూ కట్టలేదని వ్యాఖ్యానించారు.
విశేషంగా పనిచేస్తున్నారు..
అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారన్న సీఎం జగన్.. నిర్ణీత సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలన్నారు. అవినీతి, పక్షపాతం లేకుండా ఇంటి పట్టాలు అందాలని చెప్పారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
శాచ్యురేషన్ పద్ధతిలో...
అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో అర్హులైన వారికి సామాజిక తనిఖీ చేసి శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలుగుతున్నామని... ఎవరైనా మిగిలిపోతే, వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందాలని చెప్పారు. ఏటా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లు ఇవ్వాలన్నారు. పేదవాడి సొంతింటికలను నిజంచేసే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.