పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్లు, మౌలిక వసతులపై చర్చించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదల చేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలన్నారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయన్నారు. తొలివిడతలో దాదాపు రూ.15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ చేయాలన్నారు.
ఏ అప్షన్ ఎంచుకున్నా సరే..
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా.. సబ్సిడీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని సీఎం ఆదేశించారు.
మంచి జీవన ప్రమాణాలు అందాలి..
వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, సుందరీకరణపైనా చర్చించారు. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని సీఎం పేర్కొన్నారు. కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఉంటే.. కచ్చితంగా తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ ఉండాలని, ప్రతి 1500 నుంచి 5వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కాలనీల్లో పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.