CM REVIEW : ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇళ్లు పూర్తయ్యేసరికి తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం ఇతర మౌలిక వసతులు కల్పించాలని నిర్దేశించారు. ఆప్షన్ –3 కింద ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
టిడ్కో ఇళ్లపైనా.. సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. డిసెంబరు నాటికి అన్ని ఇళ్లనూ లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. దరఖాస్తు చేసిన మూడు నెలల్లో ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష చేశారు. ఇప్పటికే 96వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. మరో లక్ష 7వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు.