CM Jagan Review: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలన్నారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
మీటర్ల బిగింపు: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రగతిపై సీఎం ఆరా తీశారు. మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16లక్షల 63 వేల 705 మంది రైతులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున.. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని నిర్దేశించారు. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్న సీఎం... దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలన్నారు.
రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్ వాడుతున్న ఘటనలు దాదాపుగా అడ్డుకోగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని సీఎం అన్నారు. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. దీనివల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవని తెలిపారు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం తెలిపారు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారని, అక్కడనుంచి ఆ డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుందని సీఎం తెలిపారు. దీనివల్ల రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు.