దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తీసుకురావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి విధానాలు అమలవుతున్నాయన్న సీఎం.. ఆ విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. ఆన్లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ తితిదే విధానాలను పాటించాలని సూచించారు. దేవాదాయ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అవినీతికి చోటు ఉండొద్దు..
దేవాదాయశాఖలో అవినీతికి చోటు లేకుండా చూడాలని.. ఇందుకోసం ఆన్ లైన్ విధానాలను అవలంబించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఫలితంగా వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. ఆన్లైన్ ద్వారా దాతలు ఎవరైనా దేవాలయాలకు విరాళాలు ఇవ్వొచ్చని.. ఇందుకు సంబంధించిన పద్ధతులు, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఎక్కడా పక్కదోవ పట్టకూడదని, ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలన్నారు. తితిదే తరహాలోనే ఇతర దేవాలయాల్లో కూడా వ్యవస్థలు ఉండాలని సూచించారు. దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని అవినీతి లేకుండా ఆలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆలయాలను బాగు చేయాలన్నారు. దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లు ఇచ్చామన్న సీఎం.. భక్తుల వసతి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
ప్రణాళిక విషయంలో క్రమం తప్పొద్దు..
ప్రతి దేవాలయంలో ఇచ్చే ప్రసాదాల నాణ్యత మీద దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్.. భక్తులకు గుర్తుండిపోయేలా ప్రసాదాలు ఉండాలన్నారు. తిరుమలలో లడ్డూ తయారీ విధానాలు ఇతర ఆలయాల్లో వచ్చేలా చూడాలన్నారు. దీనివల్ల ప్రసాదాలు నాణ్యతగా ఉంటాయన్నారు. దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ,దీనివల్ల దేవాలయాలపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని సూచించారు. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, క్రమం తప్పకుండా ఈ ప్లాన్ను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. దేవాలయాల ఈవోల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. పనితీరు మెరుగుపడాలని సీఎం సూచించారు. దేవాలయాల అభివృద్ధి ఈవో పనితీరు మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. దేవాలయాలో నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించాలన్నారు. తితిదే నిర్వహణా పద్ధతులపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ ఇవ్వాలన్నారు.