CM Jagan Review on Vidya Kanuka.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అత్యుత్తమ బోధనకు ఇంటర్నెట్ సౌకర్యం దోహదపడుతుందన్నారు. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని, పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేసేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘నాడు-నేడు పనులు పూర్తి చేసిన పాఠశాలల్లో నిర్వహణ బాగుండాలి. దీనిపై వచ్చే సమీక్ష నాటికి దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలి. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించేందుకు టెండర్లు ఖరారు చేసి, వెంటనే ఆర్డర్ ఇవ్వాలి. ప్రతి తరగతి గదిలోనూ స్మార్ట్ టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలి. పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టాలి. పీడీఎఫ్‌ల రూపంలో అందుబాటులో ఉంచితే పాఠ్యపుస్తకాలు అందరికీ లభిస్తాయి. ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని అందించండి’ అని అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో పుస్తకాల కొరత రానీయొద్దన్న ముఖ్యమంత్రి జగన్
JAGAN REVIEW విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల డిజిటలైజేషన్, స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ టీవీ ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏప్రిల్‌లో అందించే జగనన్న విద్యా కానుక పంపిణీకి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని స్పష్టం చేశారు.
బాలికల భద్రతపై అవగాహన కల్పించాలి
‘బాలికల రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలి. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా విద్యార్థినులను కలిసి అవగాహన కల్పించాలి. విద్యార్థినుల సమస్యలపై ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ కోసం నియమించాలి. వచ్చే ఏడాది విద్యా కానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఏప్రిల్ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: