నివర్ తుపాను నేరుగా రాష్ట్రాని తాకకున్నా.. సమీప ప్రాంతాల్లో ప్రభావం ఉండొచ్చని సీఎం జగన్ అన్నారు. తుపాన్ దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. బుధవారం నుంచి గురువారం వరకు తుపాను ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తుపాను వల్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అంతా అప్రమత్తం కావాలని అధికారులను ఆదేశించారు. తుపాను వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. పంటలు దెబ్బతినకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉంది. గంటకు 65-75 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను వల్ల పంటలు దెబ్బతినకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ఆర్‌బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి. కోత కోసిన పంటలను రక్షించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోండి. ప్రతి మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఉండాలి - జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి