కొవిడ్ పరిస్థితులు, థర్డ్‌వేవ్, హెల్త్ హబ్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (cm jagan) సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికల దృష్ట్యా శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు, జిల్లా కేంద్రాల్లో హెల్త్ హబ్స్ (health hubs) ఏర్పాటుపై సీఎం చర్చించారు. చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ (Covid Third Wave) వస్తుందన్న సమాచారం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం చర్చించారు.
ఏర్పాట్లపై ఆరా..
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిశువులకు వైద్యచికిత్స అందించేందుకు సదుపాయాలను అధికారులు వివరించారు. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై ప్రణాళికను అధికారులు వివరించారు. ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఐసీయూ (ICU) బెడ్లు ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3777 ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక వేశామని అధికారులు వివరించారు. నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి(cm jagan) ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. పీడియాట్రిక్ (pediatric) అంశాలల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలన్నారు.
ఉచిత వైద్యం అందించాలి..
కొవిడ్ తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఎక్కువగా ఊపిరిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. వీరికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ చికిత్స(aarogyasri) ల కింద ప్రభుత్వం నిర్ధారిస్తున్న రేట్లు వారిని ఇబ్బందులకు గురిచేసే రేట్లు కాకుండా.. వాస్తవిక దృక్పథంతో ఆలోచించి రేట్లు నిర్ణయించాలన్నారు. దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా ఆరోగ్యశ్రీ నిలవాలని సీఎం సూచించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ (aarogyasri) నెట్‌వర్క్ ఆసుపత్రులకు మూడు వారాలలోపే బిల్లులు చెల్లిస్తున్నామన్న సీఎం.. ఆరోగ్య శ్రీ కింద ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో కొత్త ఒరవడికి నాంది పలికాయన్నారు. బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం అమల్లో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యమన్నారు. సకాలంలో బిల్లులు చెల్లింపు అనేది ఆరోగ్యశ్రీ పథకం విశ్వసనీయతను పెంచుతుందన్న సీఎం.. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియని అధికారులకు స్పష్టం చేసారు.