ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Review: కర్ఫ్యూలో సడలింపులు.. వివాహానికి 150 మందికే అనుమతి..! - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కర్ఫ్యూలో సడలింపులు చేశారు. వివాహాలకు 150 మందికే అనుమతి ఉంటుందని.. తెల్లవారుజూమున పెళ్లిళ్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.

CM jagan Review
CM jagan Review

By

Published : Aug 17, 2021, 1:54 PM IST

Updated : Aug 18, 2021, 4:22 AM IST

మరో గంట కర్ఫ్యూ సమయాన్ని సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకున్న వెసులుబాటును 11 గంటల వరకు పొడిగించామని తెలిపారు. కొవిడ్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ... ‘పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి. అనుమానిత లక్షణాలు కనిపిస్తే విద్యార్థులు వెంటనే పరీక్షలు చేయించుకునేలా పాఠశాలల్లోనే సౌకర్యాలను కల్పించాలి. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. పెళ్లిళ్లకు 150 మందినే అనుమతించాలి. గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా టీకాలను పంపిణీ చేయాలి. పీహెచ్‌సీలు మొదలుకొని బోధనాసుపత్రుల వరకు అవసరమైన నియామకాలన్నీ 90 రోజుల్లోగా ముగించాలి’ అని స్పష్టం చేశారు.

చిన్నపిల్లలకు న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌

గ్రామ, వార్డు క్లినిక్‌లలోనే పిల్లలకు న్యూమోకోకల్‌ కాంజుగెట్‌ టీకాలను ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పిల్లలకు తొమ్మిది రకాల టీకాలను వేస్తున్నామని, న్యూమోకోకల్‌ను జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపారు.

మందుల పర్యవేక్షణకు వెబ్‌సైట్‌

ఔషధాల నాణ్యత, ప్రమాణాలను పాటించేలా ‘కంప్యూటర్‌ ఎయిడెడ్‌ సెలక్షన్‌ ఆఫ్‌ ఇన్స్‌పెక్షన్‌’ (సీఏఏస్‌ఐ) పేరుతో కొత్త వెబ్‌సైట్‌ రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ‘ఔషధాల తయారీ సంస్థల దగ్గర నుంచి రిటైల్‌ దుకాణాల వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. టెలిఫోన్‌, వాట్సప్‌, మెయిల్‌, ఇతర మార్గాల ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తాం. ఔషధాల్లో కల్తీ నివారణకు ప్రివెంటివ్‌ యాక్షన్‌ డ్రగ్‌ సర్వేలైన్స్‌- (పీఏడీఎస్‌) పేరుతో మరొక వెబ్‌సైట్‌ ద్వారా మందుల తయారీదారుల నుంచి పంపిణీదారుల వరకు ట్రాకింగ్‌ చేస్తాం. గతంలో అజిత్రోమైసిన్‌ను ఉత్తరాఖండ్‌లో ఒక కంపెనీ తయారు చేసినట్లు సమాచారం అందడంతో తనిఖీ చేయగా అక్కడ అలాంటి డ్రగ్‌ లేదని తేలింది. ఇలాంటి వాటి నివారణకు ఈ వెబ్‌సైట్‌ ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు.

17,218 క్రియాశీలక కేసులు

రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 క్రియాశీలక కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ‘రాష్ట్రంలో. రికవరీ రేట్‌ 98.45%, పాజిటివిటీ రేటు 1.94%గా నమోదైంది. పది జిల్లాల్లో 3% కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,82,00,284 మంది వ్యాక్సిన్‌ పొందారు. వీరిలో 1,15,98,720 మంది తొలిడోసు, 66,01,563 మంది రెండు డోసులు పొందారు’ అని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు

Last Updated : Aug 18, 2021, 4:22 AM IST

ABOUT THE AUTHOR

...view details