కొవిడ్-19 నివారణపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వైనం, పెరుగుతున్న కేసులు, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఆసుపత్రుల్లో క్లీనింగ్ డ్రైవ్లు
కరోనా బీమా పరిధిలోకి వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్లో ఉన్నవారిని బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్న సీఎం... ప్రతి 2-3 రోజులకోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారుచేయాలని సీఎం సూచించారు.