ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు - సీఎం జగన్ తాజా వార్తలు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు వైద్య సేవలు, నిర్ధరణ పరీక్షల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలో మాదిరిగా రెడ్‌జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలన్నారు. ఆక్వారైతులకు నష్టం కల్గించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

cm jagan
సీఎం జగన్

By

Published : Apr 7, 2020, 3:17 AM IST

కొవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ విస్తరణ, నమోదైన కేసుల వివరాలను ముఖ్యమంత్రికి వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి అందించారు. నమోదైన 266 కేసుల్లో 243 కేసులు దిల్లీ జమాత్‌కు హాజరైన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులని వివరించారు. వారందరికీ నిర్ధరణ పరీక్షలు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్టుగా అధికారులకు సీఎంకు వెల్లడించారు.

నిర్ధరణకు కొత్త పద్ధతులు.. ఒక్కో పరికరంతో 20 శాంపిళ్లు

ఐసీఎంఆర్‌ కరోనా నిర్ధరణ పరీక్షల్లో కొత్త విధానాలను అనుమతి ఇచ్చిందని, ఈ పద్ధతుల్లో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. వీటి ప్రకారం రానున్నరోజుల్లో 240 పరికరాలు వస్తాయని, ఒక్కో పరికరం ద్వారా రోజుకు కనీసం 20 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీమెడిసన్‌ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్‌ -19 నివారణకు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించారు. ర్యాండమ్‌ టెస్టు కిట్లు ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరించి డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు సీఎం జగన్​కు వివరణ ఇచ్చారు.

ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బంది

విశాఖలో చేసిన విధంగా రెడ్‌జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. వారికిచ్చే సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టిపెట్టాలన్నారు. ప్రతి ఆస్పతిలో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ఐసీయూ బెడ్లు, వాటి సంఖ్యకు తగినట్టుగా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌–19 ప్రభావిత ప్రాంతాలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గుజరాత్‌లో ఉన్న తెలుగువారి బాగోగులు, భోజన సదుపాయాలు చూసుకోవడానికి ఏపీ నుంచి అధికారులను పంపినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని క్యాంపులకు ఒక్కో అధికారిని నియమించామని తెలిపారు.

1902 ఫిర్యాదులు సత్వర పరిష్కారం

1902కి వచ్చినా ప్రతీ ఫిర్యాదును పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలోగా ప్రత్యేక యాప్‌ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల ద్వారా పంటలు, వాటి పరిస్థితి, ఉత్పత్తి, మార్కెటింగ్, ధరలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్‌టైంలో తెలుసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చీనీ, బొప్పాయి, అరటి, మామిడి, టమాటా రైతులకు ఇబ్బందులు రాకూడదని స్పష్టంచేశారు.

ఆక్వా ఎగుమతుల రవాణాకు చర్యలు

కొవిడ్‌ –19 రెడ్‌జోన్లలో ఉన్న కర్నూలు, గుంటూరు మార్కెట్‌ యార్డులను తాత్కాలికంగా వేరే చోటుకు తరలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఆక్వా రైతులకు నష్టం చేకూర్చేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బెంగాల్, అసోం, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు చేపల రవాణాలో ఇబ్బందులను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల కొనుగోలులో రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా దాణా రేట్లపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం. . . . ఫీడ్, సీడ్​లపై నియంత్రణ, పర్యవేక్షణపై అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని నిర్ణయించారు. మే 31 నాటికి రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి :విజృంభిస్తున్న కరోనా... ప్రభుత్వం కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details