ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్-19 (కరోనా) వ్యాప్తి నిరోధానికి చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ అమలు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలపై ఆయన శనివారం తాడేపల్లిలోని కాం్యపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇస్తున్న సమయాన్ని తగ్గించాలని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. జనాభాకు తగ్గట్టుగా రైతుబజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలని, అవన్నీ అందుబాటులోకి వచ్చాకే సమయాన్ని తగ్గించే ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ తీరును సీఎస్ నీలం సాహ్నీ ముఖ్యమంత్రికి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి బాధ్యతను సతీష్‌చంద్రకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చిక్కుకున్నవారి బాధ్యతను పీయూష్‌కుమార్‌కి అప్పగిస్తూ ఆమె ఉత్తర్వులు జారీచేశారు. సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి..
ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.. ఎక్కడివారు అక్కడే ఉండాలి. వారి బాగోగులు చూసేందుకు ఆయా రాష్ట్రాల అధికారులు, సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడేందుకు ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యత అప్పగించాలి. సరిహద్దుల్లో శిబిరాల ఏర్పాటు, వాటిలో ఉన్నవారికి క్వారంటైన్, భోజన, వసతి సదుపాయాల కల్పన బాధ్యతను మరో ఐఏఎస్‌కు అప్పగించాలి. పొరుగురాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వలసకూలీలు, కార్మికులకు సమస్య లేకుండా, అక్కడే అన్ని వసతులూ కల్పించేలా ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి.