లాక్ డౌన్ మినహాయింపులతో బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరుగుతున్న వేళ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కరోనా పరీక్షలు స్వచ్ఛందంగా చేయించుకోవడం సహా వైరస్ బారిన పడితే ఎక్కడికెళ్ళి వైద్యం చేయించుకోవాలో స్పష్టంగా తెలియజేయాలన్నారు.
టెలి మెడిసిన్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14410, 104 నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రచారం ఉండాలని, పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన వైద్యం, జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలన్నారు. వైరస్ అనుమానిత లక్షణాలతో ఫోన్ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే 2, 3 వారాలు మరింత ముమ్మరంగా ప్రచారం చేయాలని... ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వాలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. టీవీలు, వార్తా పత్రికల ద్వారానూ విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ప్రజల రాకపోకల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 6 రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్ క్లస్టర్లు, ఏరియా సైజ్ వివరాలు అడిగిన సీఎం, మరోసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలపై ఆరా తీశారు.