ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేయండి' - కరోనాపై సీఎం జగన్ సమీక్ష

వలస కార్మికుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం గుండా నడిచి వెళ్లేవారిని... శ్రామిక్‌ రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు చేర్చాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఏ మాత్రం సమయం వృథా చెయ్యకుండా వారికి ఆహారం అందించి... ఇళ్లకు పంపించే బాధ్యత తీసుకోవాలని... జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

cm jagan review on corona precautions  in state
cm jagan review on corona precautions in state

By

Published : May 16, 2020, 1:11 PM IST

Updated : May 17, 2020, 7:19 AM IST

వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రం గుండా స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులను రైళ్లు, వాహనాల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు. తక్షణమే సీఎం ఆదేశాలు అమలు చేయాలంటూ రెవెన్యూ, పోలీసు శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. వలస కార్మికులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. దీనికోసం ప్రతిచెక్‌పోస్టు వద్దా ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి కాలినడకనే వస్తున్న వలస కార్మికుల్ని రిలీఫ్‌ క్యాంపులకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించింది.

రిలీఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..
జాతీయ రహదారిపై ప్రతీ 20 కిలోమీటర్లకూ ఓ చెక్‌పోస్టు, రిలీఫ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. సహాయక కేంద్రం వద్ద కార్మికులకు ఆహారం, తాగునీరు ఇవ్వాలని స్పష్టం చేసింది. హిందీ, ఒడియా భాషల్లో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని, శ్రామిక్‌ రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు పంపుతామనే విశ్వాసం వారిలో కలిగించాలని సూచించింది. స్వస్థలాలకు పంపించేంత వరకూ ఆహారం అందించాలని తెలిపింది. వలస కార్మికుల్లో రాష్ట్రానికి చెందినవారుంటే... వారిని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా స్వస్థలాలకు పంపించాలని సూచించింది. జిల్లాల వారీగా రిలీఫ్‌ క్యాంపులకు వచ్చిన వలస కార్మికుల జాబితాను... రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్‌ కు పంపాల్సిందిగా సూచించించింది. చెక్‌పోస్టులు, రిలీఫ్‌ క్యాంపుల సమన్వయం బాధ్యతలను ఐఎఎస్​ అధికారులు హర్షవర్థన్‌, రామారావుకు అప్పగించింది.

వలస కార్మికులను పంపించే ముందు వారి సొంత రాష్ట్రాల నుంచి ఎన్​వోసీ తీసుకోవాలని కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే గంజాంలో ఒడిశా ఓ రిలీఫ్‌ క్యాంపు ఏర్పాటు చేసిందనీ, ఆ రాష్ట్రానికి చెందినవారిని ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి అక్కడే అప్పగించాలని తెలిపారు. అవసరమైనంతమేరకు ఏపీఎస్​ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.


ఇదీ చదవండి :

రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి

Last Updated : May 17, 2020, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details