ప్రజలకు పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం సూచించారు. మాస్కుల వల్ల కరోనా నుంచి కొంత రక్షణ లభిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా మాస్కులు పంపిణీ చేయాలని అన్నారు. హై రిస్క్ ఉన్నవారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రుల్లో చేర్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సీఎం సూచించారు.
ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశం - కరోనా నివారణపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
కరోనా నివారణపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్, డీజీపీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సర్వే చేసి 32,349 మందిని రిఫర్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధరించారు. అయితే మొత్తం 32,349 మందికి కరోనా పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా జోన్లలో 45 వేల కొవిడ్ పరీక్షలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కొవిడ్ వ్యాప్తి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వివరించారు.
ఇవీ చదవండి:కరోనా వేళ 'ఆస్తమా' బాధితులకు ఈ ఆహారమే మేలు!
TAGGED:
తాడేపల్లిలో సీఎం జగన్ సమీక్ష