కొవిడ్-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. గడిచిన 24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదయ్యాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 80,334 మందికి పరీక్షలు చేయించామని చెప్పారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు.
దేశంలోనే అధిక సగటుతో పరీక్షలు చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పాజిటివ్ కేసుల నమోదులో దేశం మొత్తం సగటు 4.13 శాతంగా ఉండగా... రాష్ట్రంలో 1.57శాతం ఉందని చెప్పారు. అలాగే కరోనా వల్ల మరణాల్లో దేశం మొత్తం సగటు 3.19 శాతం ఉండగా… రాష్ట్రంలో 2.46 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం నమోదవుతోన్న కేసులన్నీ కంటైన్‌మెంట్ జోన్లనుంచే వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
కంటైన్‌మెంట్ ఆపరేషన్లో భాగంగా అక్కడ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, విస్తృతస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ల్యాబులు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ల్యాబుల ఏర్పాటుపైనా దృష్టి పెడుతున్నామన్నారు. ఇవన్నీ పూర్తైతే... ప్రతి జిల్లాలోనూ కరోనా పరీక్షలు చేసే ల్యాబులు అందుబాటులోకి వచ్చినట్లేనని వివరించారు.
తక్కువ లక్షణాలున్నవారు హోం ఐసోలేషన్ కోరుకుంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిందని సీఎంకు వివరించారు. టెలీమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు సరఫరాపై అధికారులతో సీఎం చర్చించారు. మందులు సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. దీనికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని అధికారులు చెప్పారు.
నిరంతరం పర్యవేక్షించండి