జనతా కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం నియమించిన పర్యవేక్షకుడు సురేష్ కుమార్, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి చర్చించారు. రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంపై విస్త్రత స్థాయిలో చర్చ జరిగింది.
విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించాల్సి ఉందని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అలాగే కరోనా అనుమానిత కేసులకు సంబంధించి ఐసోలేషన్ వార్డులు, చికిత్సలకు సంబంధించి ఉపకరణాలు, ఔషధాలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ తరహాలోనే మరో రెండు రోజులు ఇదే తరహాలో కర్ఫ్యూ కొనసాగించాలనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.