కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి, బొత్స సహా.. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
టెస్టింగ్ ల్యాబ్‌ల పెంపుపై ఆరా
రాష్ట్రంలోని మొత్తం 164 పాజిటివ్ కేసుల్లో 140 మంది దిల్లీ జమాతే సదస్సుకు వెళ్లి వచ్చిన వారు, వారి సన్నిహితులే ఉన్నారని అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం 1085 దిల్లీ వెళ్లగా.. 946 మందిని రాష్ట్రంలో గుర్తించి, 881 మందికి పరీక్షలు చేశామని వివరించారు. వారిలో 108 మంది పాజిటివ్ కేసులుగా నిర్ధరణ అయిందన్నారు. మరో 65 కేసుల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్ల సర్వే పూర్తయ్యిందని అధికారులు వివరించారు. పోలీసుల డేటా, వైద్య సిబ్బంది డేటా, క్షేత్రస్థాయి సర్వేను విశ్లేషించుకొని ఆ మేరకు వైద్య పరీక్షల నిర్వహణకు ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిరోజూ 700 మందికి పరీక్షలు చేసేలా టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంపునకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.