ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను (పీఏసీఎస్) మరింత విస్తరించాలని, ప్రతి మూడు రైతు భరోసా కేంద్రాలకు ఒకటి చొప్పున ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ బోర్డుల్లో మూడింట ఒక వంతు డైరెక్టర్లుగా వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీ రంగాల్లో నిపుణులైన వారిని నియమించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయశాఖ సహాయకులను పీఏసీఎస్‌లలో సభ్యులుగా నియమించేలా చట్టసవరణకూ ఆయన అంగీకరించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సహకారశాఖపై సీఎం అధికారులతో సమీక్షించారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా యాజమాన్య పద్ధతుల్లో తీసుకురావాల్సిన మార్పులపై నాబ్కాన్స్ (నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్) చేసిన సిఫార్సులను చర్చించారు. రెండున్నర సంవత్సరాలకు బోర్డులో 50 శాతం మంది పదవీ విరమణ చేసేలా చేసిన సిఫార్సును ఆమోదించారు. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలనూ అందించాలని చెప్పారు.
ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం కూడదు
రుణాలు ఎవరికి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలనే విషయమై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. వ్యవసాయ అనుబంధరంగాలతో పాటు ఆహారశుద్ధి రంగంలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు దన్నుగా నిలిచేలా రుణ కార్యక్రమాలు ఉండాలని చెప్పారు. ‘జిల్లా సహకార సంఘాలపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి. నాణ్యమైన సేవలందాలి. ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. అన్ని విషయాలలోను పారదర్శకంగా ఉండాలి. అవినీతికి తావుండకూడదని’ స్పష్టం చేశారు. ‘చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలోనూ గోదాములు, డ్రైయింగ్ యార్డులు, శీతల గదులు, పంట సేకరణ కేంద్రాలు, వ్యవసాయ పరికరాలు, ఇతర సామగ్రితో బహుళ ప్రయోజన కేంద్రాలను నిర్మించాలి. అక్కడ గోదాముల నిర్మాణానికి ఏప్రిల్ 15లోగా టెండర్లను ఖరారు చేసి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని’ నిర్దేశించారు.