ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సీఎం జగన్ రివ్యూ

రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.2900 కోట్ల వ్యయంతో.. 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోడౌన్ల నుంచి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వరకు అన్ని కార్యకలాపాల కోసం సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. పెద్దఎత్తున ఉత్పత్తులు కొనుగోలు చేసే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలన్న సీఎం... యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan

By

Published : Nov 23, 2020, 8:08 PM IST

Updated : Nov 23, 2020, 11:02 PM IST

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖల అధికారులు హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లపై అధికారులతో సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు. రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి, ఆ మేరకు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై రూపొందించిన ప్రణాళికను సీఎం పరిశీలించారు. మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, అరటి, టమాటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై ప్రతిపాదనలు వివరించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు, వాటి వల్ల ఉపయోగాలపై సమావేశంలో చర్చించారు.

ఎక్కువ కొనుగోళ్లు జరిగే చోట ప్రాసెసింగ్ ప్లాంట్లు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటునకు రూ.2900 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. పెద్దఎత్తున ఉత్పత్తులు కొనుగోలు చేసే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రైతులకు మంచి ధరలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం.. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. అలా కొనుగోలు చేసిన ధాన్యానికి అదనపు విలువ జోడించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పెద్ద సంస్థలతో ఒప్పందాలు

ప్రాసెసింగ్‌ యూనిట్లకు వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం ముడి పదార్థాలను అందించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్​లో వివిధ సంస్థలకు అప్పగించాలన్నారు. ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత మార్కెటింగ్‌ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని.. విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆర్బీకేల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రాసెసింగ్ రంగంలో మెగా ప్లాంట్

రెండో దశ ప్రాసెసింగ్, మొత్తం ఈ కార్యక్రమాల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లన్నీ అత్యంత ప్రొఫెషనల్‌ విధానంలో నడవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక విభాగం పని చేయాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడే సామర్థ్యంతో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని, వాటి నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్న సీఎం సూచించారు. ప్రాసెసింగ్‌ రంగంలో ఒక మెగా ప్లాంట్‌ అవసరం ఉందని అధికారులు తెలపగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం ....వీటన్నింటి ద్వారా రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి :డీఆర్సీ సమావేశంలో రసాభాస... వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం

Last Updated : Nov 23, 2020, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details