ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి: సీఎం జగన్​ - ఏపీ ముఖ్యవార్తలు

Jagan Review on Agriculture: ఖరీఫ్‌లో ప్రతి పంటనూ ఈ-క్రాప్‌ ద్వారా నమోదు చేయాలని.. ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్‌ నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనతో భాగస్వామ్యవుతుందని తెలిపారు. రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా అడుగులు వేయాలని నిర్దేశించారు.

CM REVIEW
CM REVIEW

By

Published : Aug 5, 2022, 6:48 PM IST

Updated : Aug 5, 2022, 8:40 PM IST

CM REVIEW: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌లో పంటల సాగు, వర్షపాతంపై వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయిందని తెలిపారు. ఆగస్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదయిందని వివరించారు. ఈ ఖరీఫ్‌లో 36.82 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉండొచ్చన్నది అంచనా కాగా.. ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటల సాగు చేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎరువుల అందజేతలో లోపాలు లేకుండా చూడాలని సీఎం నిర్దేశించారు. ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని.... రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు సహా అన్ని అంశాలపై నిరంతరం ప్రతి ఆర్బీకే నుంచి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా... సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించారు.

విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి

ఖరీఫ్‌లో ఈ-క్రాప్ నమోదు వంద శాతం పూర్తిచేయాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా.. ఈ-క్రాపింగ్ పూర్తిచేయాలని నిర్దేశించారు. ఆర్బీకేల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్‌లు ఈ ప్రక్రియను పూర్తిచేసేలా చూడాలన్నారు. రోజువారీగా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఈ-క్రాపింగ్ చేసిన తర్వాత.. భౌతిక రశీదు, డిజిటల్ రశీదు ఇవ్వాలన్నారు. ఈ-క్రాపింగ్ చేసినపుడు జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే.. వాటిని వెంటనే సరిదిద్దాలని సీఎం ఆదేశించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనతో భాగస్వామ్యం కానున్నట్లు సీఎం తెలిపారు. వైఎస్సార్ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలని సూచించారు. సాగు రంగంలో డ్రోన్ల వినియోగంపై సమావేశంలో చర్చించారు. డ్రోన్ల వినియోగం కోసం మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గానికో ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సీఎం నిర్దేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2022, 8:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details