కరోనాపై తాడేపల్లిలోని నివాసంలో అధికారులతో జరిపిన సీఎం జగన్ సమీక్ష ముగిసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. విదేశాల్లో చిక్కుకున్న వారి రాక రేపట్నుంచి మొదలవుతుందని అధికారులు తెలిపారు. అమెరికా నుంచి వచ్చేవారు విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలతో పాటు....ముంబయి, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలకు చేరుకుంటారని వెల్లడించారు. వచ్చే వారందరినీ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. అన్ని వసతులు ఉచితంగా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెప్పారు.
ఉచిత బస్సులు ఏర్పాటు
విమానాశ్రయాల నుంచి క్వారంటైన్ కేంద్రాలకు వచ్చే వారికి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు, సమూహాలుగా ఉన్న వారిని రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత అనుసరించాల్సిన హెల్త్ ప్రొటోకాల్‌పై సుదీర్ఘంగా సీఎం జగన్ చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వైద్య పరిశీలన, పరీక్షలు చేయాలని...ఐసోలేషన్ విధానంపై ప్రొటోకాల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్రానికి వస్తారని అధికారులు వెల్లడించారు. వారి వివరాలను గ్రామాల్లోని వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త అందించాలని సీఎం తెలిపారు. అలాగే ప్రతి సచివాలయంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్‌కు వివరాలు చేరవేయాలన్నారు. ప్రజల్లో భయాన్ని పోగొడుతూ.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాగ్రత్తలపై అవగాహన కల్పించినపుడే వైరస్‌తో సమర్థవంతంగా పోరాడగలమని జగన్ అన్నారు.
ఇవీ చదవండి...తల్లి ప్రేమను మించింది లేదు: సీఎం జగన్