పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, పరిశ్రమలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 92 పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు.. సీఎంకు వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా 2,19,766 కోట్ల పెట్టుబడుల రానున్నట్లు తెలిపారు. తద్వారా భారీగా ఉపాధి కల్పన, జరుగుతుందని,3,19,829 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ఏటా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు : పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌లో భాగంగా ఉన్న నక్కపల్లి నోడ్, శ్రీకాళహస్తి నోడ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయని, ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలని సీఎం సూచించారు. పారిశ్రామిక ప్రోత్సహకాలు వారికి అందేలా చూడాలన్నారు. ఏటా.. క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. క్లస్టర్ పద్ధతిలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలన్నారు. ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించి, వారికి అండగా నిలవాలన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అత్యుత్తమ సేవలు ఈ రాష్ట్రంలో అందాలని నిర్దేశించారు.
కాలుష్య నివారణపై దృష్టి పెట్టాలి: ఇండస్ట్రియల్ పార్కుల్లో కాలుష్య నివారణపై సీఎం సమీక్షించారు. కాలుష్య నివారణలో ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలని, ఎంఎస్‌ఎంఈలు ఉన్నచోట కాలుష్య జలాలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ .. తగిన స్థాయిలో ఉందో లేదో చూడాలన్నారు. ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామిక వాడల్లో బలోపేతం చేయాలన్న సీఎం.. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలన్నారు. దీనివల్ల పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించగలుగుతామన్నారు. పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలైన్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.