‘‘రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణాలను వేగవంతం చేయాలి. ఇప్పటికే న్యాయ సమీక్ష, టెండర్ల ప్రక్రియ పూర్తయిన చోట పనులు ప్రారంభించాలి. ఉభయగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వైద్య కళాశాలలకు భూసేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం జరగకుండా చూడాలి. వైద్య రంగానికి నిధుల కొరత రానివ్వవద్దు...’’ అని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమంలో నాడు-నేడు పనులు, వైఎస్సార్ కంటి వెలుగు పథకంపై సీఎం సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. కంటి వెలుగు కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు తాజా పరిస్థితులను సీఎంకు వివరించారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన కళాశాలలకు మే 21లోగా ప్రారంభమవుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల నిర్మాణాలు వేగవంతం చేయండి: సీఎం జగన్ - cm jagan latest updates
వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమంలో నాడు-నేడు పనులు, వైయస్సార్ కంటి వెలుగు పథకంపై.. సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం జగన్