కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోజరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రేటింగ్‌లు ఇవ్వాలి...
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతోన్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ఆస్పత్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 287 ఆస్పత్రుల్లోనూ అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్తికర స్థాయిలో ఉండాలన్నారు. ఆ మేరకు వీలైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రమాణాలను నిరంతరంగా పర్యవేక్షించాలన్న సీఎం...అందిస్తోన్న వైద్యసేవలకు అనుగుణంగా కోవిడ్ ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని ఆదేశించారు.
సిబ్బంది వేతనాలు పెంచాలి...
కొవిడ్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలన్న సీఎం.. ఆస్పత్రుల్లో పని చేస్తున్న తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారికి మంచి భోజనం అందించాలని సూచించారు. మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలన్నారు. అన్నిచోట్ల రిఫరల్ ప్రోటోకాల్ చాలా స్పష్టంగా ఉండాలని.. విలేజ్, వార్డు క్లినిక్స్ నుంచి ఆ ప్రోటోకాల్ అమలు జరగాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలని సీఎం ఆదేశించారు.