స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం.. నవంబరు 1వ తేదీన పనులు మొదలు పెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని... విగ్రహం తయారీకి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని నిర్దేశించారు. పనులు ప్రారంభించేలోగా ఆ స్థలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసులు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెంటనే తరలించాలని ఆదేశించారు.
బి.ఆర్.అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో పాటు, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్థిక, సాంఘిక సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపారు.