'ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మంచి చేయాలని ఆలోచించిన ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవు. మన రాష్ట్రంలోనే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ వాహనాల బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మరమ్మతుల కోసం అందజేస్తున్న సాయంతో వాటిలో ప్రయాణించే వారికీ భద్రత ఉంటుంది' అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం కింద 2.48 లక్షల మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.10వేలచొప్పున మొత్తం రూ.248.47 కోట్లను ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
'రోజుకు రూ.50 చొప్పున జరిమానా వేస్తున్నారని, వాహన బీమాకు రూ.7,500, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు, మరమ్మతులు చేయించేందుకు రూ.10 వేలు ఖర్చవుతోందని పాదయాత్ర సందర్భంగా డ్రైవర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో 2018లో ఏలూరు సభలో డ్రైవర్లకు మాట ఇచ్చా. దాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా మూడో ఏడాదీ డ్రైవర్లకు సాయం అందిస్తున్నాం. మూడేళ్లలో రూ.759 కోట్లు డ్రైవర్ల ఖాతాలో జమ చేశాం. ఎక్కువ మందికి రూ.30వేల చొప్పున సాయం అందింది' అని తెలిపారు.
గత ప్రభుత్వంలో చలాన్లతో భారం
గత ప్రభుత్వంలో ఆటోడ్రైవర్ల నుంచి చలాన్ల రూపంలో 2015-16లో రూ.7.39 కోట్లు, 2016-17లో రూ.9.68 కోట్లు, 2017-18లో రూ.10.19 కోట్లు, 2018-19లో రూ.7.09 కోట్లు వసూలుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 2019-20లో రూ.68.44 లక్షలు, 2020-21లో రూ.35 లక్షలను కాంపౌండింగ్ ఫీజులుగా వసూలు చేశాం. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మద్యం తాగి వాహనం నడపొద్దని మనవి చేస్తున్నా’ అని జగన్ సూచించారు.
95 అన్యాయాలు అన్నారు..
'వివక్ష లేకుండా డ్రైవర్లందరికీ సాయం అందేలా ఈ కార్యక్రమం అమలు చేస్తుంటే.. తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 95% హామీలు అమలుచేస్తే వాళ్లు 95 అన్యాయాలు అంటున్నారు. అందులో డ్రైవర్లకు సాయం కూడా ఉంది. మనం పన్నులు బాదామని అబద్ధాలు ఆడుతున్నారు. పళ్లున్న చెట్టు మీదే రాళ్లు పడతాయనే సామెత లాగే, మంచి చేసేవారిపైనే విమర్శలు చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది' అని సీఎం వ్యాఖ్యానించారు.