అంగన్‌వాడీ కేంద్రాల్లోని పూర్వ ప్రాథమిక విద్య(పీపీ-1) నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే అభ్యసించేలా గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెట్టామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘అంగన్‌వాడీ కేంద్రాల నుంచే చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయపడుతున్నాం. అందుకే అక్కడ పీపీ-1, పీపీ-2 విధానాన్ని ప్రారంభించి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు. ‘పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువేనని గట్టిగా నమ్ముతా. అందరికీ పెద్ద చదువులు అందుబాటులోకి రావాలి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు. దీనికోసం బోధనా రుసుంల విషయంలో నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేశా’ అని ఈ సందర్భంగా సీఎం వివరించారు.
ఉన్నతోద్యోగాలు సాధించకపోతే పేదరికాన్ని తీసేయలేం...
‘రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు 33% మంది ఉన్నారు. దేశ సగటు 27%. దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థాయిలో ఉంది. 18-23 సంవత్సరాల వయసు పిల్లల్లో ఇంటర్ తర్వాత మన దేశంలో 27% మంది మాత్రమే పైచదువుల కోసం కళాశాలలకు వెళుతున్నారు. పిల్లలు ఉన్నత విద్యను చదవకపోతే, పైస్థాయి ఉద్యోగాలను సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ తీసేయలేం’ అని స్పష్టం చేశారు.
రెండేళ్లలో విద్యారంగంపై రూ.26,677.82 కోట్లు ఖర్చు: