‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ మీట నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల బోధన రుసుముల్ని విడుదల చేశారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి.
'ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదు. ఉన్నత చదువులతోనే పేదరికం పోతుంది. విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలన్నదే మా ఉద్దేశం. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. విద్యార్థుల తల్లితండ్రులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తు గొప్పగా మార్చాలన్నదే మా లక్ష్యం'- సీఎం జగన్
వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వంద శాతం ఫీజు రీఎంబర్సుమెంటు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, వైద్య, ఇంజినీరింగ్ విద్యార్ధులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన ద్వారా అందుతోందని సీఎం అన్నారు. బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రతీ త్రైమాసికంలోనూ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ పథకం ద్వారా 10.97 లక్షల మంది విద్యార్ధులకు మేలు జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం రూ.18,00 కోట్లు బకాయిలుగా పెట్టి వెళ్లిందని విమర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న రూ.671 కోట్లు విద్యాదీవెన కింద చెల్లించామని.. ఇప్పటి వరకూ రూ.5,573 కోట్లు విద్యాదీవెన కింద విద్యార్ధుల తల్లుల ఖాతాలకు చెల్లించామని స్పష్టం చేశారు. తల్లితండ్రులు నేరుగా ఆయా కళాశాలలకు వెళ్లి వసతులపై నిలదీసే అవకాశముంటుందని తెలిపారు.