CM JAGAN: ‘గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌రేట్ (సీఏజీఆర్) ఇప్పుడు తక్కువే. గతంలో 19% ఉంటే ఇప్పుడు 15% ఉంది. అయినా అప్పుడు పథకాలు అమలు చేయలేకపోయారు. ఇప్పుడు అమలుచేస్తున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బటన్ నొక్కుతున్నాం. డబ్బులు బ్యాంకుఖాతాల్లోకి వెళుతున్నాయి’ అని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. గతానికి ఇప్పటికీ తేడా గమనించాలని, పథకాలు ఎలా అమలవుతున్నాయో ఆలోచించాలని అన్నారు. అప్పుడూ.. ఇప్పుడూ ఉన్నది ఒకే బడ్జెట్ అయినా.. మారింది ముఖ్యమంత్రేనని, ఇప్పుడు ఒక్కో కుటుంబానికి 3-4 పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్నతోడు పథకం కింద 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.395 కోట్ల రుణాన్ని సీఎం జగన్ బుధవారం విడుదల చేశారు.
గత ఆరు నెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించినవారికి రూ.15.96 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ పథకం కింద నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తున్నాం. ఇప్పటివరకు 15 లక్షల మందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 34లక్షల మందికి తోడ్పాటు అందిస్తుంటే ఏపీలోనే 15 లక్షల మందికి చేయూత ఇచ్చాం. దీనికి సహకరించిన బ్యాంకర్లు, అధికారులకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.