ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ' - పౌరసరఫరాల శాఖపై సీఎం జగన్ రివ్యూ

సీఎం జగన్... పౌరసరఫరాలశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ గురించి అధికారులతో చర్చించారు. అవసరమైన బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు... ముఖ్యమంత్రికి తెలిపారు. వివిధ జిల్లాల్లో సేకరించిన బియ్యం నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సరఫరాకు 99 ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్యాకింగ్​కు వాడే సంచులు.. పర్యావరణహితంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

cm jagan reivew on civil supply department
పౌరసరఫరాలశాఖపై సీఎం జగన్ సమీక్ష

By

Published : Jan 31, 2020, 5:04 PM IST

పౌరసరఫరాలశాఖపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి... తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ అమలుపై సీఎం జగన్ చర్చించారు. అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై అధికారులు.. సీఎంకు వివరించారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌, రబీ పంటల ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పంపిణీ కోసం సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను సీఎం జగన్​కు చూపించారు.

ఆగస్టు నాటికి అన్ని నియోజకవర్గాల్లో ప్యాక్ చేసిన బియ్యం

శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏప్రిల్‌ 1 నాటికి 22 నియోజకవర్గాలు, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్‌ నాటికి 70 నియోజకవర్గాల్లో పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని దిశానిర్దేశం చేశారు.

30 చోట్ల 99 బియ్యం ప్యాకింగ్ యూనిట్లు

నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం 30 చోట్ల 99 నాణ్యమైన ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటిలో 41 సివిల్‌ సప్లైస్‌వి కాగా, మరో 58 చోట్ల పీపీపీ పద్ధతిలో ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 30-40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నెలకు 2వేల టన్నుల బియ్యాన్ని ప్యాకే చేసే సామర్థ్యంతో యూనిట్లను రూపొందించాలని సూచించారు. సత్వర పంపిణీ కోసం తగిన సిబ్బంది, వాహనాలు ముందుగానే గుర్తించాలన్న సీఎం... ప్యాకింగ్​కు పర్యావరణహిత సంచులనే వాడాలని స్పష్టం చేశారు. సంచులను తిరిగి సేకరించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి :ఏపీపీఎస్సీపై క్యాలెండర్​ విడుదల చేయనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details