రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఫైబర్‌నెట్, అప్పట్లో కార్డుదారులకు ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలపై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సమావేశంలో ఈ అంశాలపై సుమారు అరగంటపాటు చర్చ జరిగింది. ఉప సంఘం నివేదిక గురించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.
ఫైబర్‌నెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో వాటిని ఎలా ఉల్లంఘించారనేదీ అంశాల వారీగా మంత్రి వివరించారు. ‘ఫైబర్‌గ్రిడ్ పాలకమండలిని ఏర్పాటు చేసి, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ అనే వ్యక్తిని ఎండీగా నియమించారని.... ఆ వ్యక్తి గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో పట్టుబడ్డారని మంత్రి బుగ్గన తెలిపారు. లోకేశ్ సన్నిహితుటైన టెరా సాఫ్ట్ సంస్థకు ఫైబర్‌నెట్ టెండరు ఇచ్చారని... కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే సుమారు 1,400 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించారని మంత్రి తెలిపారు. పారా పవర్‌సాఫ్ట్ అనే సంస్థ అర్హత పొందినా పరిగణనలోకి తీసుకోలేదని... నిర్వహణ బాధ్యతను కూడా టెరాసాఫ్ట్ సంస్థకు సంబంధించిన జెమిని కంపెనీకి అప్పగించారని మంత్రి బుగ్గన మంత్రిమండలి భేటీలో వివరించారు. 380 కోట్ల రూపాయల విలువైన సెట్‌టాప్ బాక్సుల సరఫరా విషయంలోనూ టెరాసాఫ్ట్ కంపెనీ సంబంధించిన మూడు కంపెనీలకు టెండరు ఖరారు చేశారని... ఎల్-1గా నిలిచిన కొరియన్ కంపెనీని పక్కనపెట్టేశారని మంత్రి బుగ్గన వివరించారు.
చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా సరకుల సరఫరా టెండర్లలోనూ అక్రమాలు జరిగాయని మంత్రి బుగ్గన భేటీలో వివరించారు. ఒక ప్రైవేట్ పోర్టల్ ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా సరకుల సరఫరా టెండర్లు ఖరారు చేశారని... కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్ ఉన్నా పట్టించుకోలేదని అన్నారు. అర్హతలు కొందరికే అనుకూలంగా ఉండేలా మార్గదర్శకాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారని... శనగలను 24 శాతం, గోధుమపిండిని 25 శాతం అధిక ధరకు కొన్నారని వివరించారు. నెయ్యి విషయంలో ఒకటి రెండు కంపెనీలకు అనుకూలంగా చేశారని మంత్రి బుగ్గన తెలిపారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నపుడు మంత్రులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.